ఇండస్ట్రీకి మళ్ళీ మంచి రోజులొచ్చాయ్…

ఇండస్ట్రీకి మళ్ళీ మంచి రోజులొచ్చాయ్…

హైదరాబాద్:

తెలుగు చలన చిత్ర పరిశ్రమకి మళ్ళీ మంచి రోజులోచ్చాయా? అంటే అవుననే చెప్పాలి. గతంలో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమని, నేడు మనం చూస్తున్న సినీ పరిశ్రమని ఒక్కసారి గమనిస్తే ఆ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

తెలుగు ఇండస్ట్రీలో స్టార్‌డమ్ ఉన్న హీరోలకి అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో.., హద్దులు లేని వారి అభిమానం ఎటువంటి తారస్థాయిలో ఉంటుందో.. మనం ప్రత్యేకంగా చెప్పేదెముంది.

ఎన్టీఆర్- ఏఎన్నార్‌ల కాలంలో…  

హీరోల మధ్య పోటీ ఉండటం కామనే. అది కూడా ఎలాంటి పోతే ఉండాలి? ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ఒకరి ఎదుగుదలని చూసి ఒకరు ఈర్ష్య పడకుండా, వారిని మించి నటించాలనే స్థాయిలో ఉండాలి.

రాగ ద్వేషాలకు ఏ మాత్రం తావు లేకుండా తమ తర్వాత వచ్చే కొత్త నటులకి ఆదర్శంగా నిలవాలి.

ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్,కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోల మధ్యలో  ఇలాంటి పోటీనే ఉండేది. ఒకరినొకరు గౌరవించుకునేవారు. ఒకరి షూటింగ్‌కి మరొకరు వెళ్ళేవారు. ఏదైనా కష్టం వస్తే అంతా కలిసి ఒకే తాటిపైకి వచ్చేవారు. వారి అభిమానులు కూడా అలాగే హుందాగా ప్రవర్తించేవారు.

తర్వాత తరం వచ్చే సరికి అది లేదు…

వెండితెరని ఏలిన ఎన్టీఆర్- ఏఎన్నార్‌ల శకం ముగిసింది. తర్వాత తరం వచ్చే సరికి అది క్రమేపీ తగ్గింది. హీరోలు బాగానే ఉన్నారు. కానీ, అభిమానులే వారి స్థాయిని మరిచిపోయి ఒకరినొకరు దూషించుకోవడం, కొట్టుకోవడం మొదలు పెట్టారు.

చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్ తదితర హీరోలు అంతా కలిసి మెలిసి ఉంటున్నా అభిమానుల్లో మాత్రం చీలికలు, గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. అభిమాన హీరోల కోసం కొట్టుకుని పోలీసు స్టేషన్‌కి వెళ్లినోళ్ళు కూడా ఉన్నారు.

ఒక పెద్ద హీరో సినిమాలు విడుదలైతే చాలు వారికి పోటీగా ఉన్న హీరో అభిమానులు ఆ సినిమా పోస్టర్లు చించడం, పేడ చల్లడం వంటివి చేసేవారు. పరస్పర దూషణలు, అభిమాన హీరో కోసం ఏమైనా చేసే అభిమానం పిచ్చిగా మారింది. అది క్రమేపీ పెరుగుతూ వచ్చింది.

నేటి తరం అంతా ఒకే తాటిపైకి…

ముందు తరం హీరోల అభిమానుల కంటే ఎక్కువగా నేటి తరం హీరోల అభిమానులు పరస్పరం దూషించుకుంటూ.. అసభ్యకరమైన పదజాలాలు వాడటమే కాకుండా వారికి నచ్చని హీరోల ఫోటోలను అసభ్యకరంగా ఎడిట్ చేస్తూ.. ఆ హీరోల కుటుంబీకులపై కూడా తమ దురభిమానాన్ని ప్రదర్శించారు.

ఇదంతా చూస్తూ ఓపిక పట్టలేని హీరోలు అభిమానుల ఆగడాలకి కళ్ళెం వేయాలని అనుకున్నారు. దీనికోసం జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ ఒక్క అడుగు ముందుకి వేశారు.  ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమాకి క్లాప్ కొట్టడానికి స్వయంగా పవన్ కల్యాణ్ రావడం, వారివురూ సన్నిహితంగా ఉండడం చూసిన అభిమానుల్లో కొంత మార్పు వచ్చింది.

తర్వాత ఎన్నడూ లేని విధంగా ఒక స్టార్ హీరో ఫంక్షన్‌కి మరొక స్టార్ హీరో ముఖ్య అతిధిగా రావడం జరిగింది. ‘భరత్ అనే నేను’ బహిరంగ సభలో ఎన్టీఆర్, మహేశ్ బాబు మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ మహేశ్‌ని ‘అన్నా’ అనడం, మహేశ్ ఎన్టీఆర్‌ని ‘తమ్ముడు తారక్’ అనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.

ఇక తర్వాత మహేశ్ బావమరిది సుధీర్ బాబు ‘సమ్మోహనం’ సినిమా ఆడియో వేడుకకి మెగాస్టార్ చిరంజీవి రావడం, ఆయన కొడుకు కోడలు రామ్ చరణ్- ఉపాసన ఎన్టీఆర్ వివాహ వార్షికోత్సవానికి వెళ్ళి శుభాకాంక్షలు తెలపడం, చరణ్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్‌తో ఆడుకోవడం ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి శుభపరిణామాలు చోటు చేసుకోవడం జరిగాయి.

వాళ్లేమీ మారలేదు..

నిజానికి హీరోలేమీ మారలేదు. ఒకప్పుడు కూడా వారు అలాగే ఉన్నారు. కానీ, కెమెరా వెనుక కలిసున్నారు. ఎన్టీఆర్ ‘బాద్‌షా’ చిత్రానికి చరణ్ క్లాప్ కొట్టడం, ఆది సినిమా ఆడియో వేడుకకి ‘మహేశ్ బాబు’ ముఖ్య అతిధిగా రావడం, ఇలా ఒకటి కాదు ఎన్నో జరిగాయి.

వారి సాన్నిహిత్యం కెమెరా వెనుకే ఉంటే అభిమానులు మారరని తెలిసి అంతా కలుసుకోవడం, సరదాగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం మొదలు పెట్టారు. ఒకప్పుడు హీరోల కోసం అభిమానులు గొడవ పడితే.. ఇప్పుడు అభిమానుల కోసం హీరోలే కలిసిమెలిసి ఉంటున్నారు.

మామాట: మొత్తానికి అభిమానుల్లో మార్పు తీసుకొచ్చారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *